తెలంగాణకు పదేళ్లలో 10 లక్షల కోట్లు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ , భారత రాష్ట్ర సమితి పార్టీలు చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు.
వారు చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ పట్ల ప్రేమ ఉందే తప్ప ద్వేషం లేదన్నారు. అలా ఉండటానికి వీలు లేదన్నారు. తాము అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చామో చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు.
దమ్ముంటే చర్చకు రావాలని అన్నారు బండి సంజయ్ కుమార్. రాష్ట్ర అభివృద్ది కోసం గత 10 ఏళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించిందన్నారు.
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం సానుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద బీఆర్ఎస్, కాంగ్రెస్ లు విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి. ప్రజల సామాజిక, ఆర్థిక ప్రగతి కోసం కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందనేది అక్షర సత్యమన్నారు.