NEWSTELANGANA

కాంగ్రెస్ రుణ మాఫీ బ‌క్వాస్ – బండి

Share it with your family & friends

ఇచ్చిన మాట నిల‌బెట్టుకోని సర్కార్

హైదరాబాద్ – కేంద్ర హొం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన రేవంత్ రెడ్డి స‌ర్కార్ వాటిని అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు.

రైతుల‌కు సంబంధించి రూ. 2 ల‌క్ష‌ల రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప‌దే ప‌దే ఊద‌ర‌గొడుతూ వ‌చ్చార‌ని, చివ‌ర‌కు రూ. 17 వేల కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశామ‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. బ్యాంక‌ర్ల నివేదిక ప్ర‌కారం రూ. 48 వేల కోట్ల‌కు పైగానే కావాల్సి ఉంటుంద‌న్నారు బండి సంజ‌య్ కుమార్.

కానీ మిగ‌తా రైతుల‌కు ఎలా , ఎప్పుడు ఇస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి. ఇలా ఎంత కాలం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతూ పాల‌న సాగిస్తారంటూ ప్ర‌శ్నించారు . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు . ఇప్ప‌టికే రైతులు రాష్ట్రంలోని ప‌లు చోట్ల రోడ్ల పైకి వ‌చ్చార‌ని, ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం వెంట‌నే అంద‌రికీ రుణాలు మాఫీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

కొత్త ప్ర‌భుత్వ పాల‌న పూర్తిగా ప‌క్క‌దారి ప‌ట్టింద‌న్నారు. దీని కార‌ణంగా ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేద‌న్నారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క రైతుకు రుణ మాఫీ చేయాల‌ని కోరారు.