బండ్ల గణేష్ పై కేసు నమోదు
ఇల్లు కబ్జాకు ప్రయత్నం
హైదరాబాద్ – నటుడు, నిర్మాత , కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కబ్జాకు పాల్పడినట్లు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా తన ఇంట్లో అద్దెకు ఉంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ. 75 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. బండ్ల గణేష్ తనను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమను నానా రకాలుగా ఇక్కట్లకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు హీరా గ్రూప్ చైర్మన్. ఇప్పటికే పలుమార్లు లీగల్ నోటీసులు ఇచ్చినా పట్టించు కోవడం లేదని, గూండాలతో బెదిరింపులకు గురి చేశాడని ఈ విషయం గురించి తెలిపినా ఒక్కరు కూడా స్పందించ లేదని వాపోయారు నౌహీరా షేక్.
తమ విలువైన ఇంటిపై కన్నేశాడని, కాదంటే అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. గత్యంతరం లేక తాము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు.