సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా విమర్శలా
హైదరాబాద్ – హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల వల్ల తాను రూ. 100 కోట్లు నష్ట పోయానంటూ సంచలన ఆరోపణలు చేశారు నిర్మాత సింగనమల రమేష్ బాబు. ఆ ఇద్దరితో తాను తీసిన కొమురం పులి, ఖలేజా ఫెయిల్ కావడానికి వారే కారణమంటూ వాపోయారు. దీంతో సింగనమల చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నిర్మాత బండ్ల గణేశ్. చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. నీ వల్ల పవన్ కళ్యాణ్ మూడేళ్ల పాటు కాల్షీట్స్ వేస్ట్ అయ్యాయని మండిపడ్డారు.
పెద్ద హీరోల పట్ల వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించు కోవాలని హితవు పలికారు. బుధవారం నిర్మాత బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ప్లాన్ చేసుకోక పోవడం వల్లనే సినిమా సరిగా రాలేదన్నారు. దానికి పవన్ కళ్యాణ్ ను బాధ్యుడిని చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ ఒకరికి కష్టం వస్తే చూస్తూ ఊరుకునే మనిషి కాదన్నారు. తను ఎన్నో కోట్లను వదులుకున్నాడని , ఎవరికైనా బాధ కలిగితే చలించి పోతాడని పేర్కొన్నారు. ఇంకోసారి ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయొద్దన్నాడు బండ్ల గణేశ్.