ఎంఎస్ రామయ్య విద్యా సంస్థల ఉదారత
తిరుమల – తిరుమల శ్రీవారికి శుక్రవారం బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎం.ఎస్.సుందర్ రామ్ అనే భక్తుడు అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు రూ.45 లక్షల విలువైన అశోక్ లేల్యాండ్ కంపెనీకి చెందిన రెండు బడా దోస్త్ మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లను విరాళంగా అందించారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ అత్యాధునిక వాహనాలు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో కూడా క్యూలైన్ల వెంబడి ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. ఈ వాహనాలతో ఒకేసారి 3 వేల మందికి అన్న ప్రసాదాలు పంపిణీ చేయవచ్చన్నారు.
ఈరోజు నుండి ఈ వాహనాలను వినియోగించనున్నట్లు వెల్లడించారు. దాతలు ప్రస్తుతం రెండు వాహనాలను విరాళంగా ఇచ్చారని, మరో వాహనం డిజైనింగ్ లో ఉన్నందున త్వరలో అందివ్వనున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్ పోర్ట్ డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసన్న, ఇన్ ఛార్జ్ డీఐ హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.