రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ క్రికెట్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా తాను క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. దీంతో మహ్మదుల్లా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తను క్రికెటర్ గా ఎన్నో సేవలు అందించాడు. మరెన్నో విజయవంతమైన మ్యాచ్ లలో కీలక పాత్ర పోషించాడు. 39 ఏళ్ల వయసు కలిగిన మహ్మదుల్లా 2021లో టెస్ట్ ఫార్మాట్ కు , 2024లో టి20 లకు గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్ జట్టు తరపున 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్ లలో కలిపి 11 వేల 47 రన్స్ చేశాడు.
రిటైర్మెంట్ సందర్బంగా మహ్మదుల్లా మీడియాతో మాట్లాడాడు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన జీవిత కాలంలో ఈ స్థాయికి చేరుకుంటానని తాను ఎప్పుడూ అనుకోలేదన్నాడు. ఇంత కాలం తను దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వ పడుతున్నానని చెప్పాడు. దేశ ప్రజలు తనను ఆదరించారని, అక్కున చేర్చుకున్నారని, అంతే కాకుండా తన భార్య, పిల్లలు ఎంతగానో మద్దతుగా నిలిచారని కొనియాడారు. తనను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు మహ్మదుల్లా.