అమెరికా భవిష్యత్తు మీ చేతుల్లోనే – ఒబామా
కమలా హారీస్ ను గెలిపించాలని విన్నపం
అమెరికా – ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది మీరేనంటూ అమెరికన్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ప్రస్తుతం దేశ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు హోరా హోరీగా కొనసాగుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో డొనాల్డ్ ట్రంప్ , కమలా హారీస్ మాటల తూటాలు పేల్చుతున్నారు. ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
అన్ని వర్గాల వారికి మెరుగైన భద్రత, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవ ప్రదమైన జీవితం కావాలని అనుకుంటే కమలా హారీస్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లేదంటే ట్రంప్ ను ఎన్నుకోవాలని మీరు భావిస్తే తాము అడ్డు చెప్పబోమని స్పష్టం చేశారు బరాక్ ఒబామా. నియంతృత్వానికి పర్యాయ పదం ట్రంప్ అని ఆరోపించారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ట్రంప్ కే దక్కిందన్నారు ఒబామా. గాడి తప్పిన వ్యవస్థలను సవ్యమైన మార్గాల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రెసిడెంట్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ప్రయత్నం చేశారని చెప్పారు. మరోసారి ఆమెకు అవకాశం ఇవ్వాలని కోరారు బరాక్ ఒబామా.
శాంతి, సామరస్యం కావాలని అనుకుంటే మీ విలువైన ఓటు వేయాలని సూచించారు. దేశ భవితవ్యం కమలా చేతిలో భద్రంగా ఉంటుందన్నారు.