కమలా హరీస్ నాయకత్వం అమెరికాకు అవసరం
స్ఫష్టం చేసిన అమెరికా మాజీ చీఫ్ బరాక్ ఒబామా
అమెరికా – అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పనితీరును తూర్పార బడుతున్నారు. అమెరికాను సర్వ నాశనం చేశారని ఆరోపించారు.
ఈ తరుణంలో కమలా హారీస్ కు మద్దతుగా రంగంలోకి దిగారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఈ సందర్బంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. శాంతి కావాలా లేక నిత్యం హింసను ఇష్టపడి, ప్రోత్సహించే, అయిన దానికీ కాని దానికీ గిల్లి కజ్జాలు పెట్టుకునే డొనాల్డ్ ట్రంప్ కావాలో తేల్చు కోవాలని ఆయన అమెరికన్లకు సూచిస్తున్నారు.
అక్టోబర్ 21 కమలా హారీస్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు బరాక్ ఒబామా. ఇదే సమయంలో ఆమెను గెలిపించాలని, తమ విలువైన ఓటు వేయాలని, అమెరికాను కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. లేక పోతే మన దేశం తీవ్ర ఇబ్బందుల్లోకి వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వేచ్ఛ, సమానత్వం, ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవితం అందించే ప్రయత్నం కమలా హరీస్ వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు బరాక్ ఒబామా.