అమెరికాలో హోరా హోరీ ప్రచారం
కమలా హారీస్ కు మద్దతుగా ఒబామా
అమెరికా – అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆఖరి అంకానికి చేరుకుంది క్యాంపెయిన్. ఈ తరుణంలో నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. బరిలో నిలిచిన యుఎస్ మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
గతంలో ఎన్నడూ లేని రీతిలో అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఆయన రేయింబవళ్లు నిద్ర హారాలు మాని ప్రచారంలో పాల్గొంటున్నారు. కమలా హారీస్ కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. లేకపోతే అమెరికా భవితవ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒబామా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అన్ని రంగాలలో మరింత ముందుకు వెళ్లాలంటే కమలా హారీస్ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి అనర్హుడని సంచలన వ్యాఖ్యలు చేశారు బరాక్ ఒబామా. తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం జరగబోయే అధ్యక్ష ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు. ఇదే సమయంలో ఓటు వజ్రాయుధమని, దానిని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని పేర్కొన్నారు.