యుఎస్ బాగుండాలంటే కమలాకు ఓటేయండి
పిలుపునిచ్చిన మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా
అమెరికా – అమెరికాలో దేశ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటా పోటీగా కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నా ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు తావీయడం లేదు. యావత్ ప్రపంచం ఇప్పుడు యుఎస్ లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై ఫోకస్ సారించింది. ఈ తరుణంలో అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన విస్తృతంగా ప్రస్తుతం ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన దేశ ఉపాధ్యక్షురాలు , ప్రవాస భారతీయురాలు కమలా హారీస్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆమెను గెలిపించేందుకు ఒబామా కంకణం కట్టుకున్నారు. ఆయనతో పాటు తన సతీమణితో కలిసి దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అమెరికా బాగు పడాలంటే, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు దక్కాలంటే, హింసోన్మాదం అన్నది లేకుండా ఉండాలంటే, మెరుగైన సమాజం కావాలని అనుకుంటే మన ముందు ఉన్నది ఏకైక వ్యక్తి. ఆమె ఎవరో కాదు కమలా హారీస్ అని పేర్కొన్నారు. ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ప్రశాంతమైన, మెరుగైన జీవితం కావాలని అనుకునే వారందరూ మద్దతు ఇవ్వాలని కోరారు బరాక్ ఒబామా. ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా వీడియో సందేశం అందించారు.