మహిళా క్రికెటర్లకు ఖుష్ కబర్
పురుష క్రికెటర్లతో సమానంగా వేతనం
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. మహిళా క్రికెటర్లకు తీపి కబురు చెప్పింది. పురుష క్రికెటర్లతో సమానంగా ఫీజులు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా వెల్లడించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
ఎవరి పట్లా వివక్షా పూరితమైన ధోరణితో బీసీసీఐ వ్యవహరించదని స్పష్టం చేశారు జే షా. తమ సంస్థ కాంట్రాక్టు విధానాన్ని పురుషులు, మహిళా క్రికెటర్లకు సమానంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఇందులో భాగంగా బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని నిర్వహించిందని, ఈ మేరకు పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు సమానంగా ఫీజులు చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని స్పష్టం చేశారు కార్యదర్శి జే షా. క్రికెట్ లో లింగ సమానత్వం కలిగి ఉండాలని తాము బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల మహిళా క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ టోర్నీలో ఆడుతోంది. ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.