పశ్చిమ బెంగాల్ లో సీఎం వర్సెస్ గవర్నర్
పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ల మధ్య మాటల యుద్దం మరింత పెరిగింది. గవర్నర్ ను తొలగించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. తనను కించ పరిచేలా మాట్లాడారంటూ, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ గవర్నర్ సీఎంపై రూ. 11 పరువు నష్టం దావా వేశారు. దేశంలోనే తొలిసారిగా ఓ గవర్నర్ ముఖ్యమంత్రిపై దావా వేయడం. తనను కావాలని కేంద్రం ఇరుకున పెట్టాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు దీదీ..
ఈ సందర్బంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ గవర్నర్ పై నిప్పులు చెరిగారు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు గౌరవం ఇచ్చినా పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. బెంగాల్ ప్రజలు దేనినైనా సహిస్తారని కానీ సీఎం పదవిలో ఉన్న మహిళను అవమానిస్తే చూస్తూ ఊరుకోరన్నారు సీఎం.
ఇదిలా ఉండగా రాజ్ భవన్‌లో దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపింది.
కాగా మహిళలు రాజ్ భవన్ ను సందర్శించేందుకు భయపడుతున్నారని సీఎం వాపోయారు. దీనికి గవర్నరే కారణమంటూ ఆరోపించారు. అంతకు ముందు రాజ్ భవన్ లో కాంట్రాక్టు మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన కామెంట్స్ చేశారు సీఎం.