శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో
తిరుపతి – తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భాష్యకార్ల ఉత్సవాలు సాత్తుమొరతో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం స్వామి వారికి తిరుమంజనం, ఆస్థానం, సాత్తుమొర నిర్వహించారు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా మీమాంస గ్రంథానికి శ్రీభాష్యం పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధి చెందారు.
భగవద్ రామానుజులు దేశమంతటా సంచరించి శ్రీవైష్ణవ తత్వాన్ని పరిపుష్టం చేస్తూ ప్రచారం చేశారు. దేశంలోని అనేక శ్రీవైష్ణవ క్షేత్రాల జీర్ణోద్ధరణ, అభివృద్ధి చేయడంతో పాటు ఆలయ పూజాది కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశ పెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జీయర్ మఠం ఏర్పాటుతో పాటు శ్రీవారి ఆలయంలో ఉప ఆలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ, పలు నైవేద్యాల సమర్పణ, ఆళ్వార్ దివ్యప్రబంధ పాశురాల పారాయణం, నాలుగు మాడ వీధుల ఏర్పాటు, పూర్ణకుంభ స్వాగతం, ఆచార్య పురుషుల నియామకం వంటి వాటిని శ్రీ రామానుజాచార్యులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.