కేసీఆర్ అబద్దాలకు కేరాఫ్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆయన అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు కరెంటు పోయిందని ప్రతిపక్ష నేత కేసీఆర్ ట్విట్టర్ లో చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. సబ్ స్టేషన్ నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగిందని తెలిపారు. అది డిజిటల్ మీటర్ లో ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే రీడింగ్ చేస్తుందని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క.
శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నమోదు చేసిన రీడింగ్, పరిసర ప్రాంత ప్రజల ఇళ్లలో ఎలాంటి కరెంటు కోతలు జరగలేదని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా జరిగిందని తమ అధికారులు నిర్ధారించారని తెలిపారు.
కేసీఆర్ నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారని ఆరోపించారు, పార్లమెంటు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. .
ఇటీవల సూర్యాపేట పట్టణంలో సైతం ఇదే తరహాలో విద్యుత్ శాఖను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించి అబాసు పాలయ్యారని గుర్తు చేశారు.