ప్రియాంక విజయం భట్టి సంతోషం
ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు
హైదరాబాద్ – వాయనాడు లోక్ సభ ఉప ఎన్నికల్లో రికార్డ్ విజయాన్ని నమోదు చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఆమె ఏకంగా 3.68 లక్షల మెజారిటీని సాధించారు. గతంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ . ఈ సందర్బంగా ప్రియాంక గాంధీ విజయం పట్ల స్పందించారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ సాధించిన ఈ విజయం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. వయనాడు ప్రజలు పార్టీపై, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై పూర్తి నమ్మకంతో ఉన్నారని ఈ ఫలితంతో తేలి పోయిందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ప్రగతి, సుస్థిరత కోసం కాంగ్రెస్ పార్టీ దార్శనికతపై ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం పునరుద్ఘాటిస్తుందని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, అవకాశాల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ, వాయనాడ్‌కు శ్రేయస్సు తీసుకురావడానికి అంకితభావంతో పనిచేస్తూ ప్రియాంక గాంధీ పార్లమెంటులో బలమైన గొంతుకగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు మల్లు భట్టి విక్రమార్క.