హరీశ్ రావు చెప్పేవన్నీ అబద్దాలే
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ – తెలంగాణ శాసన సభలో మాటల యుద్దం మొదలైంది. నువ్వా నేనా అంటూ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య కొనసాగింది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు . ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
ఈ సందర్బంగా జోక్యం చేసుకున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. హరీశ్ రావు మతి తప్పి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. సభ సాక్షిగా పచ్చి అబద్దాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సభను, రాష్ట్ర ప్రజలను తప్పదోవ పట్టించేలా మాట్లాడ్డం సరైంది కాదన్నారు డిప్యూటీ సీఎం.
ఎక్సైజ్ శాఖకు సంబంధించి వేలం నిర్వహించామని, అందుకే ఆదాయం పెరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు . అసలు వేలం ఇప్పుడు కదా పెట్టాల్సింది..ముందే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని నిలదీశారు భట్టి విక్రమార్క.
ఎంత దొరికితే అంత దోచుకుందామని ముందే వేలం పాట చేపట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి వేలం ద్వారా రావాల్సిన ఆదాయాన్ని టానిక్ లాంటి మద్యం దుకాణాలు పెట్టి ప్రభుత్వానికి రాకుండా చేసి కొన్ని కుటుంబాల జేబుల్లోకి పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.