గిరిజనుల అభివృద్దిపై సర్కార్ ఫోకస్
ఐటీడీఏ సమావేశంలో డిప్యూటీ సీఎం
ఖమ్మం జిల్లా – రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి సర్వతో ముఖాభివృద్ది కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం పాలక మండలి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ సమావేశాలు నిర్వహించకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న గత బిఆర్ స్ ప్రభుత్వం ఐటిడిఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా పాలక మండలి సమావేశంలో సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు డిప్యూటీ సీఎం. విద్య, వైద్యం, ఆశ్రమం, ఉపాధి కి బాటలు వేసే విధంగా ఐటీడీఏ ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
ఐటీడీఏ పరిధిలో గిరిజన జీవన స్థితిగతులు మెరుగుపడాలి అంటే విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఆదిశగా అధికారుల ప్రణాళికలు ఉండాలన్నారు. రెసిడెన్షియల్, ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.