ఆంక్షలు లేకుండా ఉచిత విద్యుత్
ఇస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా విద్యుత్ అందజేస్తామని అన్నారు. 200 యూనిట్ల దాకా ఉచితంగా ఉంటుందన్నారు. ఆ తర్వాత వచ్చే యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
సచివాలయంలో ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, సురేఖ పాల్గొన్నారు. తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఇప్పటి వరకు ఇవాల్టితో ప్రారంభించిన వాటితో కలుపుకుంటే మొత్తం నాలుగు గ్యారెంటీలను అమలు పర్చడం జరిగిందన్నారు మల్లు భట్టి విక్రమార్క. రాబోయే రోజుల్లో మిగతా 2 గ్యారెంటీలను కూడా పూర్తి చేస్తామన్నారు. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదనే తాము ఈ హామీలను ఇవ్వడం జరిగిందన్నారు. ఇవాళ అత్యంత పారదర్శకమైన పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.