అభివృద్ది పేరుతో బీఆర్ఎస్ దోపిడీ
నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
హైదరాబాద్ – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బీఆర్ఎస్ ను ఏకి పారేశారు. తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. సోమవారం భట్టి మీడియాతో మాట్లాడారు. ఇష్టానుసారం దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చాక ఖజానా ఖాళీగా ఉందన్నారు.
పదేళ్ల పాటు ఎవరి కోసం పని చేశారో బీఆర్ఎస్ ఎంపీలు ఆలోచించు కోవాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలకు మద్దతు పలికిన వారు మీరు కాదా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఛీ కొట్టారని, కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు.
హైదరాబాద్ ను పదే పదే అభివృద్ది చేశామని చెబుతున్నారని, అభివృద్ది పేరుతో లక్ష కోట్లు దోచు కున్నారని ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు. ప్రజలు మేలుకోక పోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.