NEWSTELANGANA

విశ్వ మాన‌వుడు గ‌ద్ద‌ర్

Share it with your family & friends

ప్ర‌శంస‌లు కురిపించిన భ‌ట్టి

హైద‌రాబాద్ – ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ ఈ ప్ర‌పంచం ఉన్నంత దాకా ఉంటాడ‌ని అన్నారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. గ‌ద్ద‌ర్ జ‌యంతిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు డిప్యూటీ సీఎం.

కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం అన్నారు. గద్దర్ ఆలోచనలు, భావజాలాన్ని, రచనలు, పుస్తకాలను, పాటలను అన్నింటిని బతికిస్తామ‌ని ప్ర‌క‌టించారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గద్దర్ ఆలోచనలను సంపూర్ణంగా అమలు చేస్తుందన్నారు. ప్రపంచం తో పోటీ పడే విధంగా ప్రగతిశీల భావాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామ‌ని అన్నారు. గద్దర్ అన్న ఆలోచనలు, పాటలను ఆనాడు నిషేధించిన చోటనే గద్దర్ అన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం అనేది ఆషామాషీ కాదన్నారు.

ధరణి పేరిట అన్యాయంగా పేదల నుంచి గుంజుకున్న భూములను తిరిగి అప్ప‌గిస్తామ‌న్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీగా మారితే ప్ర‌జ‌లు ఛీ కొట్టార‌ని త‌మ‌కు ప‌వ‌ర్ అప్ప‌గించార‌ని అన్నారు.

ప్రజల కోసం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తేవాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన నా పాద యాత్రకు పీపుల్స్ మార్చ్ అని గ‌ద్ద‌ర్ పేరు పెట్టార‌న్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని గొప్పలు చెప్పుకున్న ఆ నాయకుడి కంటే ముందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాదయాత్ర చేసి ప్రజలను కదిలించిన మహా నాయకుడు గద్దర్ అని కొనియాడారు.