బాధిత కుటుంబాలకు భట్టి భరోసా
వరద సహాయక చర్యల పర్యవేక్షణ
ఖమ్మం జిల్లా – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రహదారులన్నీ నీటి కుండలను తలపింప చేస్తున్నాయి. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. మరో రెండు రోజుల పాటు భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్ర వాతావరణ కేంద్రం.
ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో మధిర నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు.
వర్షాల కారణంగా బుగ్గ వాగులో చిక్కుకున్న వెంకటేశ్వర్లును రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న నదులను, వాగులను సందర్శించారు.
ఈ సందర్బంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బాధితులకు బాసటగా నిలవాలని సూచించారు మల్లు భట్టి విక్రమార్క.