జగన్ పై దాడి చేసేందుకు కుట్ర – భూమన
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ చైర్మన్
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ , వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎప్పటి లాగే వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించు కోవాలని అనుకున్నారని , ఈ మేరకు కీలక ప్రకటన కూడా చేశారని స్పష్టం చేశారు.
అయితే ప్రశాంతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకున్న జగన్ రెడ్డిపై రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే దాడి చేయాలని కొందరు కుట్రకు తెర లేపారంటూ షాకింగ్ కామెంట్స్ . తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిందని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, కానీ అనుకోకుండా తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అదుపులోకి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్.
గత రెండు రోజుల నుంచి తమ పార్టీ నేతలందరికీ నోటీసులు ఇవ్వడమే కాకుండా భయాందోళనకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.