టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి
తిరుపతి – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అధికారం ఉంది కదా అని కూటమి సర్కార్ కక్షసాధింపు ధోరణికి పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయని , గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
గురువారం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలన పూర్తిగా గాడి తప్పిందని, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దాని నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని త్వరలోనే బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
ప్రభుత్వం ఏ విచారణ నిర్వహించినా పెద్దిరెడ్డి శుభ్రంగా, కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా బయటపడతారని ఆయన నొక్కి చెప్పారు.పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఉద్దేశ పూర్వకంగా లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారంలో పాల్గొంటున్నందుకు పక్షపాత మీడియాను భూమన విమర్శించారు.
ప్రతిపక్షం, ముఖ్యంగా టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే పెద్ద కుట్రలో భాగంగా ఈ దుష్ప్రచారాలను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.