NEWSANDHRA PRADESH

తిరుప‌తి ల‌డ్డూపై రాజ‌కీయం త‌గ‌దు

Share it with your family & friends

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న కామెంట్

తిరుప‌తి – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా స‌త్య దూర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేవ‌లం రాజ‌కీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్య‌ల‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. వేంకటేశ్వర స్వామి పోటు వ్యవహారాలలో సాక్ష్యాత్తు శ్రీ వైష్ణవులు అయిన సధ్బ్రాహ్మణుల అమృత హస్తాలతో కొన్ని వందల సంవత్సరాలుగా తిరుప‌తి ల‌డ్డూ త‌యార‌వుతోంద‌ని తెలిపారు.

ముడి సరుకులు నాణ్యంగా లేవని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోటు కార్మికులు పోటు నుండి బయటకు వచ్చి అనేక సందర్భాలలో నిరసన దీక్షలు కూడా చేసిన విష‌యం మ‌రిచి పోతే ఎలా అని గుర్తు చేశారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

వేంకటేశ్వర స్వామిని వాడుకుంటే మనకి ఓట్లు వస్తాయి అనే ఆలోచనతో కొండ మీద అంతా అపచారం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి ఓట్లు పొందాడని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ అధికారులు తనకు అనుకూలంగా నివేదికలు సమర్పించ లేదని అధికారులను తిట్టి వెనక్కి పంపాడని ఆరోపించారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. ఎలాంటి విచార‌ణ‌కైనా తాము సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. కావాల‌ని చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు .