శ్రీవారి మీద ఒట్టు..ఏ తప్పు చేయలేదు
మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
చిత్తూరు జిల్లా – తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న తరుణంలో తీవ్రంగా స్పందించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము తప్పు చేశామని, తమ హయాంలోనే శ్రీవారి లడ్డూ తయారీ కల్తీ జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు.
ఆయన కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి కామెంట్స్ చేశారని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్.
ఒకవేళ తాము తప్పు చేశామని విచారణలో తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నామని ప్రకటించారు భూమన కరుణాకర్ రెడ్డి. అంతే కాదు తాము తప్పు చేస్తే రక్తం కక్కుకుని చచ్చి పోవాలని ఆ వేంకటేశ్వర స్వామిని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని చెప్పారు టీటీడీ మాజీ చైర్మన్.
చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఒకవేళ నిజమని నమ్మితే వెంటనే సీబీఐతో కానీ లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా గానీ విచారణ చేయించాలని ఏపీ సీఎంను డిమాండ్ చేస్తున్నానని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
ఇకనైనా ముందు వెనుకా ఆలోచించి కామెంట్స్ చేయాలని నారా చంద్రబాబు నాయుడుకు హితవు పలికారు.