స్కామ్ లు సరే రైతులను ఆదుకోండి
కాంగ్రెస్ సర్కార్ పై కాటేపల్లి కన్నెర్ర
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణా రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ముందు అన్నదాతలకు సంబంధించి పంటల సాగుకు గాను విద్యుత్ సరఫరా ఏ విధంగా అందుతుందో అన్న విషయం ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే.
తాను అసెంబ్లీకి రావడం కొత్త కావచ్చు కానీ రాజకీయాలకు కొత్త కాదన్నారు కాటేపల్లి వెంకట రమణా రెడ్డి. విద్యుత్ అంశానికి సంబంధించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతోనే సరి పోయిందన్నారు. విచారణ చేపట్టండి..దోషులు ఎవరో తేల్చాలని కోరారు స్పీకర్ ను.
ఎన్ని వేల కోట్లు పెట్టామన్నది ముఖ్యం కాదు రైతులకు కావల్సిన సౌకర్యాలు ఉన్నాయా లేవా అన్నదే ముఖ్యం అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. డీడీలు కట్టిన రైతులకు కొత్త ట్రాన్స్ ఫార్మర్ లు వచ్చే పరిస్థితి లేదన్నారు.
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల విషయంలో రైతులు పడుతున్న సమస్యలను ఇప్పుడున్న ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు కాటేపల్లి వెంకట రమణా రెడ్డి. విద్యుత్ శాఖలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మీటర్ రీడింగ్ చేసేవాళ్ల జీవితాలు ఆగమ్య గోచరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.