ఢిల్లీ ఎన్నికల వేళ మేనిఫెస్టో రిలీజ్
ఢిల్లీ – ఢిల్లీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇవాళ్టితో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారం హోరెత్తుతోంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, ఆప్ , కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా.
మహిళా సమృద్ది యోజన పేరుతో మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 , పేద మహిళలకు సిలిండర్ పై రూ. 500 సబ్సిడీ, హొళీ, దీపావలి పండుగలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, గర్భిణీలుకు రూ. 21,000 ఇస్తామని హామీల వర్షం కురిపించారు. అంతే కాకుండా ఆరు పోషకాహారం కిట్లు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించారు.
శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో గురించి వివరించారు జేపీ నడ్డా. అటల్ క్యాంటీన్ యోజన పథకం కింద మురికా వాడల్లో రూ. 5 కే భోజనం అందజేస్తామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ. 5 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం అమలు చేస్తామని వెల్లడించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వం కొనసాగుతోంది. ఈసారి కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని, అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు ఎలాగైనా సరే బీజేపీ ఛాన్స్ దక్కించు కోవాలని చూస్తోంది. మొత్తంగా ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడుతారనేది త్వరలో తేలనుంది.