బీజేపీ విజయ సంకల్ప యాత్ర
20 నుంచి ప్రారంభం
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర జరగనుంది. ఈ మేరకు ఆదివారం పార్టీ ఆఫీసులో ఆ పార్టీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా విజయ సంకల్ప యాత్ర ఈనెల 20 నుంచి ప్రారంభం అవుతుందని ఈ సందర్బంగా పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్రలు కొనసాగుతాయని తెలిపారు. మరోసారి అధికారంలోకి రావడానికి తాము ఈ యాత్ర చేపడుతున్నట్లు స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.
దేశ వ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం తమ పార్టీ కూటమికి 400 సీట్లు తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర దామోదర దాస్ మోదీ కొలువు తీరడం ఖాయమన్నారు గంగాపురం కిషన్ రెడ్డి.
ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే ప్రజలు తమను గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇక తమను అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదన్నారు కేంద్ర మంత్రి, పార్టీ చీఫ్.