పిలుపునిచ్చిన బోళ్ల శివ శంకర్
హైదరాబాద్ – బహుజన మేధావులు, నేతలు, ప్రజా సంఘాల బాధ్యులు బీసీల రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు ఓబీసీ రిజర్వేషన్ సాధన సమితి జాతీయ అధ్యక్షుడు బోళ్ల శివ శంకర్. బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లయినా బహుజన, తాడిత, పీడిత, మైనార్టీ వర్గాలు ఇంకా వివక్షకు లోనవుతూనే ఉన్నాయని ఆవేదన చెందారు. ఇది కాదనలేని సైత్యం. ఇవాళ కులం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, కొన్ని కులాలు మాత్రమే రాజ్యాధికారంలో కొనసాగుతూ ఉండడం వల్లనే రిజర్వేషన్లు కల్పించాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. ఇక దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి తెలంగాణలో అణగారిన వర్గాల పరిస్థితి దయనీయంగా ఉందని, అంతకంటే దారుణంగా ఉందని వాపోయారు బోళ్ల శివ శంకర్.
బీసీలకు సంబంధించి కుల గణన పూర్తి స్థాయిలో, మరింత పారదర్శకతతో జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీనినే తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తావించారని, డిమాండ్ కూడా చేశారని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు సమ న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయా సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారని తెలిపారు. మేధావులు, బీసీ, బడుగు, బలహీన, మైనార్టీ, ఇతర కులాలకు సంబంధించిన సంఘాల బాధ్యులతో చర్చించారని, వారు సూచనలు, సలహాలను తీసుకుని 35 పేజీలతో నివేదిక తయారు చేశారని పేర్కొన్నారు . సదరు నివేదికను కుల గణన సర్వే కమిషన్ చైర్మన్ వెంకేటశ్వర్ రావును కలిసి అందజేయడం జరిగిందన్నారు బోళ్ల శివ శంకర్.
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో బహుజనులు, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం మాటల వరకే పరిమితమైందని, మన కోటా మన వాటా అన్నది ప్రధాన నినాదంగా మారుతున్న ఈ క్రమంలో బీసీల గురించి ఎవరైనా మాట్లాడే హక్కు ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే, నిలదీసే హక్కును కల్పించిందని, ఎవరి అభిప్రాయాలు వారివని. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం , కామెంట్స్ చేయడం తగదని హితవు పలికారు బోళ్ల శివ శంకర్.
రాహుల్ గాంధీ ఓ వైపు రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తున్నారని, మరో వైపు కుల గణన చేయిస్తున్నామని చెబుతున్నారని, కానీ ఈ కుల గణన ఎవరి కోసం చేస్తున్నారో, ఎందుకోసం చేస్తున్నారో కూడా ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇది సర్కార్ బాధ్యత. లేదా ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు దీనిని నిర్వహిస్తున్నారో కూడా తెలుసు కోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ప్రస్తుత పాలనలో బీసీలకు ప్రాతినిధ్యం లభించడం లేదన్నది వాస్తవం అన్నారు బోళ్ల శివ శంకర్. దీనిని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలి. వ్యక్తిగతంగా వైరుధ్యాలు, భేదాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ సంస్థాగత పరంగా అన్యాయం జరిగినప్పుడు అందరం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. లేక పోతే అత్యధిక జనాభా, ఓటు బ్యాంకు కలిగిన బహుజన వర్గాలు తీవ్ర అన్యాయానికి గురవుతాయని, రాజ్యాంగ బద్దంగా రావాల్సిన హక్కులు అడగటం మనందరి కర్తవ్యమని, ఇది బహుజన నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలుసుకుంటే మంచిదని సూచించారు.
ఇదే పంథాను ఉత్తర ప్రదేశ్ లో దివంగత కాన్సీరామ్, మాజీ సీఎం మాయావతి అనుసరించారని తెలిపారు. వారు అధికారంలోకి వచ్చారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వారు తమ పాలసీని మార్చుకోలేక పోయారని పేర్కొన్నారు. ఇది పక్కన పెడితే ఆనాడు కాన్షీరాం బ్రాహ్మణులకు కూడా సీట్లు ఇచ్చిన సంగతి మరిచి పోకూడదన్నారు. బీసీలు సాధిరాకత సాధించేంత వరకు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. అంతే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిమ్న వర్గాలన్నీ ఏకం కావాలి. ఇందుకు వారిని ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దీనికి రాజకీయ చైతన్యం కూడా అవసరం ఉందన్నారు బోళ్ల శివ శంకర్.
ఆనాడు సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ తీసుకున్న చొరవ కారణంగానే ఇవాళ బీసీలకు 23 శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలవుతోందని తెలుసుకుంటే మంచిదన్నారు. ఆర్టికల్ 9 రాజ్యాంగ సవరణ కాకుండా బీసీలకు ఏ విధంగా రాజ్యాధికారం వస్తుందో దానిపై ఫోకస్ పెట్టాలన్నారు. బీసీలకు రాజకీయ చైతన్యం అవసరం అని 2023లోనే ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ వస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా బీసీ రాజ్యాధికారం కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. రాజ్యంలో భాగమైతేనే మనం హక్కులను సాధించు కోగలమన్నారు. ఇది గుర్తు పెట్టుకుని మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ అన్ని వర్గాలం ఏకం అవుతూ మన కోటా మన వాటా సాధించేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.