Thursday, April 3, 2025
HomeNEWSబాంబే హైకోర్టులో ర‌వి ప్ర‌కాష్ కు షాక్

బాంబే హైకోర్టులో ర‌వి ప్ర‌కాష్ కు షాక్

మేఘా పై వేసిన పిటిష‌న్ కొట్టివేత

ముంబై – మేఘా ఇంజినీరింగ్ సంస్థపై టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కొట్టి వేసింది ముంబై హైకోర్టు. మేఘా సంస్థ బోరెవెళ్లి ప్రాజెక్టులో బ్యాంకు గ్యారంటీ ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఆయ‌న‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రవి ప్రకాష్ దాఖలు చేసిన పిల్‌ను కొట్టి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కేసులో మేఘా ఇంజినీరింగ్ తరపున ముకుల్ రోహత్గీ, డేరియస్ ఖంబాటా, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ తరపున తుషార్ మెహతా, రవి ప్రకాష్ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.

చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ భారతి డాంగ్రే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ రోజు రవి ప్రకాష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ తరపున ఇంటరిమ్ అప్లికేషన్ కూడా దాఖలైంది. ఇందులో రవి ప్రకాష్ వేసిన పిల్, అతనిపై పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు న్యాయస్థానం చర్చించింది.

దాదాపు 10 రోజుల క్రితం జరిగిన వాదనల్లో, మేఘా తరపున ముకుల్ రోహత్గీ మరియు డేరియస్ ఖంబాటా మాట్లాడుతూ, పిటీషనర్ రవి ప్రకాష్ కోర్టును తప్పుదారి పట్టిస్తూ, న్యాయ ధిక్కారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. అలాగే, బాంబే హైకోర్టు , న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని రుజువులతో సహా కోర్టులో సమర్పించారు. ఈ పిల్ వ్యక్తిగత ద్వేషంతో ప్రేరేపించబడి, ప్రజా ప్రయోజనంతో ముడిపడి లేదని పేర్కొన్నారు. పిల్ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా కోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎంఎంఆర్‌డీఏ తరపున హాజరైన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ పిల్‌ను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నిబంధనలకు అనుగుణంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. రవి ప్రకాష్‌కు లోకస్ స్టాండీ (వాదించే అర్హత) లేదని, వివాదాస్పద గ్యారంటీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా \, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ధృవీకరించాయని తెలిపారు. కానీ ఈ అంశాలను పిటీషనర్ ఉద్దేశ పూర్వకంగా దాచేశారని వివరించారు.

ప్రతిస్పందనగా, రవి ప్రకాష్ తరపున ప్రశాంత్ భూషణ్, సోషల్ మీడియా పోస్టులను అంగీకరించినప్పటికీ అవి “అతిగా ఉత్సాహంతో” పోస్ట్ చేయబడ్డాయని, తరువాత తొలగించబడ్డాయని తెలిపారు. వాటి ప్రభావం పరిమితమైనదని పేర్కొన్నారు. కోర్టు లోకస్ స్టాండీ లేదని భావిస్తే, విచారణ కోసం అమికస్ క్యూరీని నియమించవచ్చని సూచించారు.

తదుపరి సమగ్ర వాదనలు విన్న అనంతరం, బాంబే హైకోర్టు మేఘా ఇంజినీరింగ్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తూ, రవి ప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments