గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ – దావోస్ లో జరిగిన ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పెట్టుబడులకు, దిగ్గజ కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పారు. రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సాధించిందని, ఈ ఘనత అంతా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వల్లనే సాధ్యమైందన్నారు.
గేమ్ ఛేంజర్ గా రాష్ట్రం మారబోతోందన్నారు. గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందన్నారు. తెలంగాణ పేరుతో విధ్వంసం చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆవేదన చెందారు. రాష్ట్ర ఖజానా పూర్తిగా నిల్ గా మారిందన్నారు.
అప్పులు చేసి తమ నెత్తిన పెట్టారని, వాటికి వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గ్రామ సభల్లో లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతోందన్నారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.