లడ్డూ పేరుతో రాజకీయం తగదు
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి – లడ్డూ పేరుతో రాజకీయం చేయడం తగదని అన్నారు మాజీ మంత్రి , ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత , ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలన పూర్తిగా గాడి తప్పిందని అన్నారు.
100 రోజుల పాలన పేరుతో సంబురాలు చేసుకోవడం తప్పితే ఏపీకి ఆయన చేసింది ఏమీ లేదన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకుని అభివృద్దిపై దృష్టి సారించాలని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.
తమ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లో కీలక మార్పులు తీసుకు రావడం జరిగిందని చెప్పారు. అయితే తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో ఏపీ సీఎం చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇది కావాలని రాజకీయంగా జగన్ రెడ్డిని ఎదుర్కోలేక చేసిన కుట్రగా బొత్స సత్యనారాయణ అభివర్ణించారు.
ఒకటికి మూడుసార్లు నెయ్యిని పరీక్షించడం జరుగుతుందని, అంతా క్లియర్ గా ఉంటేనే , పరీక్షలలో నాణ్యవంతమైనదిగా తేలితేనే లడ్డూ తయారీకి ఉపయోగిస్తారని స్పష్టం చేశారు . ఇవేవీ తెలుసు కోకుండా చంద్రబాబు నాయుడు తమపై , తమ నాయకుడు జగన్ రెడ్డిపై అభాండాలు వేయడం సబబు కాదన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో కానీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ.