ఎన్నిక ఏకగ్రీవం బొత్స మహదానందం
జగన్ రెడ్డి..ప్రజా ప్రతినిధులకు థ్యాంక్స్
విశాఖపట్టణం – విశాఖపట్టణం స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితం ఏకగ్రీవం అయ్యింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఎలాగైనా సరే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ చీఫ్ , సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్, డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ , బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించ లేదు.
నారా చంద్రబాబు నాయుడు హడావుడిగా తమ కూటమి తరపున అభ్యర్థిగా బైరాను ప్రకటించారు. కానీ చివరకు పోటీలో లేకుండానే ఉన్నట్టుండి విరమించు కుంటున్నట్లు వెల్లడించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విస్తు పోయారు.
విచిత్రం ఏమిటంటే విశాఖపట్టణం ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు మంచి పట్టుంది. ఇక్కడి స్థానిక సంస్థలలో మొత్తం 838 స్థానాలు ఉండగా ఇందులో వైఎస్సార్సీపీకి 530కి పైగా సీట్లు ఉన్నాయి.
పార్టీ చీఫ్ , మాజీ సీఎం జగన్ రెడ్డి ముందుగానే తమ పార్టీ తరపున అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించారు. చివరకు పోటీ నుండి కూటమి అభ్యర్థితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా కూడా విరమించు కోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ జగన్ రెడ్డికి, ప్రజా ప్రతినిధులకు రుణపడి ఉన్నానని అన్నారు.