ఏపీలో పెట్రో కెమికల్ కారిడార్
ముందుకు వచ్చిన బీపీసీఎల్
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. ముందు చూపు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీని అన్ని రంగాలలో అభివృద్ది పథంలోకి తీసుకు పోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఆ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మోడీ కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన భూమిక పోషిస్తున్నారు. ఒకవేళ ఆయన మద్దతు ఇవ్వక పోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.
దీంతో కీలకమైన శాఖలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు రావాల్సిన నిధులు, పనుల గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రస్తుతం ఏపీ ఆర్థికంగా చితికి పోయిందని వెంటనే కేంద్రం లక్ష కోట్లు సాయం చేయాలని కోరారు. ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సమ్మతించినట్లు సమాచారం.
ఇది పక్కన పెడితే ఏపీకి తీపికబురు చెప్పింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్). ఈ మేరకు ఏపీలోని మచిలీపట్నంలో కొత్త రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ. 60 నుంచి 70 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఇందులో భాగంగా 25 వేలకు పైగా జాబ్స్ కల్పిస్తామని పేర్కొంది. ఆయిల్ రిఫైనరీ తో పాటు పెట్రో కెమికల్ కారిడార్ కోసం కనీసం 4 నుంచి 5 వేల ఎకరాలు కావాలని ప్రతిపాదనలు చేసింది సీఎం చంద్రబాబు నాయుడుకు.