Saturday, April 19, 2025
HomeDEVOTIONALర‌థోత్స‌వం అంగ‌రంగ వైభవోపేతం

ర‌థోత్స‌వం అంగ‌రంగ వైభవోపేతం

భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

తిరుమల – తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింప జేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులు మారు మోగాయి.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే” అన్న ఆర్ష వాక్కులు రథోత్సవం మోక్ష ప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథ రూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు.

ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశ రీరం వేరనీ, సూక్ష్మ శరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.

వాహన సేవలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో జె శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments