శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
సమీక్షించిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుమల – ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్దం అవుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు ఈవో జె. శ్యామల రావు. వచ్చే నెల అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఈవో సమీక్ష చేపట్టారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్ పాల్గొన్నారు.
అక్టోబరు 8న గరుడసేవ రోజున అదనపు పార్కింగ్ స్లాట్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని విజిలెన్స్ అధికారులను ఈఓ ఆదేశించారు.
తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాలు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు కలిపి సుమారు 11000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతాయి. అదనపు పార్కింగ్ స్లాట్ల కోసం ప్లాన్ చేయడంతో పాటు బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీ, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఈఓ ఆదేశించారు.
అనంతరం ఇంజినీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, నీరు, అన్న ప్రసాదం పంపిణీ, శ్రీవారి సేవకుల సరిపడా ఏర్పాటు, గార్డెన్ వింగ్ అలంకరణలు, సరిపడా లడ్డూల నిల్వ, ఉత్తమ నృత్య బృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర కార్యక్రమాలపై ఈఓ సమీక్షించారు.
అంతకు ముందు లడ్డూ కాంప్లెక్స్, పోటును సంబంధిత అధికారులతో కలిసి ఈఓ పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా లడ్డూ కౌంటర్లు, బూందీ పోటులను సందర్శించి లడ్డూల పంపిణీ, బూందీ తయారీ ప్రక్రియను పర్యవేక్షించి శ్రీవారి పోటుపై సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు.
సీఈ సత్యనారాయణ, ఆలయ డీఈవో లోకనాథం, ఈఈ1 శ సుబ్రహ్మణ్యం, జీఎం ట్రాన్స్పోర్ట్ శేషారెడ్డి, సీపీఆర్వో డాక్టర్ టీ రవి తదితరులు పాల్గొన్నారు.