జనవరి 29 నుండి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి – కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడంచింది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 29వ తేదీన ఉదయం ధ్వజారోహణం,
రాత్రి చంద్రప్రభ వాహనం జరుగుతుంది. 30న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి పెద్దశేష వాహనంపై స్వామి వారు దర్శనం ఇస్తారు. 31న ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి సింహ వాహనం ఉంటుంది.
ఫిబ్రవరి 1న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం , 2న ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం , 3వ తేదీన ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజ వాహనంపై స్వామి వారు దర్శనం ఇస్తారని తెలిపింది టీటీడీ.
4వ తేదీన ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం, 5న ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనంపై స్వామి వారు ఊరేగుతారని టీటీడీ పేర్కొంది. 6వ తేదీన ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి హంస వాహనం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి దేవుని గడప శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు.