రైతుల కోసం గులాబీ దళం
రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ పై కన్నెర్ర
తెలంగాణ – రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల కోసం ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అన్ని ప్రాంతాలలో నిరనస వ్యక్తం చేశారు. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. కావాలని రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా ఇస్తామంటూ రోజు రోజుకు మాటలు మారుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు.
ఇప్పటి వరకు ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒక్క మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదని ఆరోపించారు. మరో వైపు రైతులు పంటలను నష్ట పోతే ఇప్పటి వరకు ఆదుకున్న పాపాన పోలేదన్నారు. పండించిన వడ్లను కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాపోయారు మాజీ మంత్రి గంగుల కమలాకర్.