ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మూడు రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తాను పోరాడి సాధించి తీసుకు వచ్చిన తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
జూన్ 1 నుండి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా రాష్ట్ర, జాతీయ జెండాలు ఎగుర వేయాలని స్పష్టం చేశారు కేసీఆర్. ముగింపు వేడుకలను అంగరంగ వైభవోపేతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఆయా రోజుల వారీగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. జూన్ 1న అమరులకు పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతారు. 2న తెలంగాణ భవన్ లో దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ముగింపు సభ చేపడతారు. దీనికి కేసీఆర్ నాయకత్వం వహిస్తారు. 3న రాష్ట్ర మంతటా కార్యక్రమాలు , జెండా ఆవిష్కరణలు చేపట్టనున్నారు.