పేదోళ్ల ఇళ్లు కూల్చే అధికారం ఎవరిచ్చారు..?
నిప్పులు చెరిగిన అనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులు, బడా బాబులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారంటూ నిలదీశారు. వారికేమో ముందస్తు నోటీసులు ఇవ్వడం, పేదలకైతే చెప్పకుండానే ఇళ్లను, గుడిసెలను కూల్చడం ఎంత వరకు సబబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనుగుల రాకేష్ రెడ్డి.
హైడ్రా పేరుతో ఆగమాగం చేయడం తప్పితే ఏమీ లేదన్నారు. ఇది కేవలం అమరావతి రాజధానికి మేలు చేకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నం అని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఏదో ఒక రోజు తిరగబడటం ఖాయమని హెచ్చరించారు.
పేదలు, సామాన్యులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం ఇలా ఉన్నోళ్లకు, అక్రమార్కులకు అండగా ఉండటం దారుణమన్నారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు మాత్రమే ఇచ్చిన హైడ్రా పాలమూరులో పేదల ఇళ్లను నోటీసు లేకుండా ఎలా కూల్చారంటూ ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని ధ్వజమెత్తారు అనుగుల రాకేశ్ రెడ్డి.