సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫిర్యాదు
ఫిర్యాదు చేసిన ముఠా గోపాల్..దాసోజు..బాల్క
హైదరాబాద్ – రాష్ట్రంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నోరు పారేసుకున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
మరో వైపు తామేమీ తీసి పోలేదని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో చోటు చేసుకున్న ఆరోపణల పర్వం తారా స్థాయికి చేరుకుంది.
ఇదిలా ఉండగా తాజాగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురూ కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తమ పార్టీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై దుర్భాష లాడారంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.