NEWSTELANGANA

కుల గ‌ణన‌పై బీఆర్ఎస్ నేత‌ల ప‌ర్య‌ట‌న

Share it with your family & friends

త‌మిళ‌నాడుకు చేరుకున్న సీనియ‌ర్లు

హైద‌రాబాద్ – బీసీ కుల గ‌ణ‌న‌పై అధ్య‌య‌నం చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులతో కూడిన బృందం గురువారం త‌మిళ‌నాడు రాష్ట్రానికి బ‌య‌లు దేరి వెళ్లింది.

బీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు వీరంతా అధ్య‌య‌నం చేసేందుకు వెళ్ల‌డం విశేషం. అక్క‌డి ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ల‌తో పాటు కుల గ‌ణ‌న ఏ విధంగా చేప‌ట్టార‌నే దానిపై అధ్య‌య‌నం చేయ‌నుంది ఈ బీఆర్ఎస్ నేత‌ల బృందం.

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైకి ఈ బృందం చేరుకుంది. ఈ టూర్ లో భాగంగా ఈ టీమ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ తో పాటు సంబంధిత శాఖా మంత్రులు, మేధావుల‌తో భేటీ కానుంది. వారు ఇచ్చే సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా కుల గ‌ణ‌న చేయాల‌ని ప్ర‌ధానంగా డిమాండ్ పెరుగుతోంది.

తాజాగా రాష్ట్రంలో బీసీ కుల గ‌ణ‌న కోసం అత్య‌ధిక కులాలు క‌లిగిన సంఘాలు , మేధావులు డిమాండ్ చేస్తున్నారు. కుల గణన, అణగారిన వర్గాలకు పెంచిన రిజర్వేషన్లు, సంస్థాగత అభివృద్ధి వ్యూహాల వంటి కీలకమైన విషయాలను ఈ సంద‌ర్భంగా చ‌ర్చించ‌నున్నారు.

ఈ విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు సీనియ‌ర్ నాయ‌కుడు దాసోజ్ శ్ర‌వ‌ణ్ కుమార్. తెలంగాణలో కుల గణన, సామాజిక న్యాయం, సమానమైన పాలన కోసం త‌మ‌ నిబద్ధతను బలోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.