సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ్యాట్సాఫ్
హైడ్రా కూల్చి వేతలు సబబేనంటూ కామెంట్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. కొందరు ప్రజా ప్రతినిధులు హైడ్రా దూకుడుపై అభ్యంతరం తెలిపితే మరికొందరు దానిని స్వాగతిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హైడ్రాను స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సబబేనంటూ కితాబు ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలు విస్మయానికి గురయ్యారు.
ఇదిలా ఉండగా మాధవరం కృష్ణారావు కీలక సూచనలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి. చెరువులో కట్టుకున్న అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే వారిని వదిలి పెట్ట వద్దని కోరారు .
అంతే కాకుండా గొలుసుకట్టు చెరువులపై అనేక నాలాలు ఉన్నాయని ఆరోపించారు. వాటిపై ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయాలని, తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. హైడ్రా చేస్తున్న పనులను తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మాధవరం కృష్ణారావు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.