సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మర్యాద పూర్వకమేనన్న వెంకట్రావు
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కుటుంబ సమేతంగా కలుసుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డితో ముచ్చటించారు. ఈ సందర్బంగా తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అవసరమైన మేరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
సీఎంను కలిసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తాను మర్యాద పూర్వకంగానే రేవంత్ రెడ్డిని కలిశానని, తాను పార్టీలో చేరేందుకు కాదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజుల నుంచి తాను బీఆర్ఎస్ ను వీడుతున్నానని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని ఆవేదన చెందారు.
తాను ముందు నుంచీ ప్రజలతోనే ఉన్నానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చానని స్పష్టం చేశారు తెల్లం వెంకట్రావు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ బాట పట్టారు. కమలం, హస్తం కండువాలు కప్పుకున్నారు. పొంగులేటి అనుచరుడిగా గుర్తింపు పొందిన తెల్లం ఉన్నట్టుండి జంప్ అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.