గవర్నర్ ను కలిసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ . ఆయన సారథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శనివారం గవర్నర్ కేపీ రాధాకృష్ణన్ ను కలుసుకున్నారు.
ఈ సందర్బంగా వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగంపై అధికార పక్షం చేస్తున్న దాడులు, నిరుద్యోగులపై జరుగుతున్న దాడులు, కేసులను వివరించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ప్రధానంగా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను కావాలని వత్తిళ్లకు , బెదిరింపులకు గురి చేస్తూ తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతున్నారంటూ ఆరోపించారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు చేరడంపై చర్యలు తీసుకోవాలని, వారిపై వేటు వేసేలా చూడాలని కోరారు కేటీఆర్. ఈ సందర్బంగా గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
నిరుద్యోగుల నిరసనలు, అరెస్టులపై హోంశాఖ కార్యదర్శితో మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్.