సీఎం రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక నేరాలకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారని, మరి ఎందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణా రావును నియమించారంటూ ప్రశ్నించారు. అబద్దాలు చెప్పడం, మాయ మాటలతో మోసం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ఆర్థికంగా దివాళా తీశారంటూ ఆరోపించిన సీఎం ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా సీఎస్ గా నియమిస్తారంటూ ఫైర్ అయ్యారు.
మంగళవారం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. రుణాలు, బడ్జెట్ కేటాయింపుల నుండి వ్యయ చట్రాలు , ఆర్థిక ప్రాధాన్యతల వరకు గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి ప్రధాన ఆర్థిక నిర్ణయాన్ని రూపొందించి, సమర్థించి, అమలు చేసినది రామకృష్ణారావు అని స్పష్టం చేశారు. రేవంత్ ఆరోపించినట్లుగా నిజంగా ఏదైనా “ఆర్థిక దురాగతాలు” ఉంటే, రామకృష్ణారావు మౌన ప్రేక్షకుడు కాదు, ఆ కార్యక్రమాలలో చురుకైన భాగస్వామి, ప్రధాన చోదకుడుగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తన హయాంలోనే 11 బడ్జెట్ లను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేలా చేశారని చెప్పారు దాసోజు శ్రవణ్. పారదర్శకత, జవాబుదారీతనం గురించి ఆయన మాట్లాడటం తెలంగాణ ప్రజలను ఎగతాళి చేసే క్రూరమైన జోక్ తప్ప మరొకటి కాదన్నారు.