ఎమ్మెల్సీలపై చైర్మన్ కు ఫిర్యాదు
పట్నం..కూచుకుళ్లపై ఎమ్మెల్సీల లేఖ
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని , ఆ ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు గులాబీ పార్టీకి చెందిన నేతలు.
తాజాగా ఎన్నికల సందర్భంగా జంప్ అయ్యారు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. ఆయన తనయుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. డాక్టర్ రాజేశ్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికలకు ముందు జంప్ కావాలని అనుకున్నారు. కానీ కేసీఆర్ ముందు జాగ్రత్తగా పట్నంకు ఆగమేఘాల మీద మంత్రి పదవిని కట్టబెట్టారు.
ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ సర్కార్ కూలి పోయింది. కేసీఆర్ ఆశలు అడియాశలు అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పట్నం, కూచుకుళ్ల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్సీలు చైర్మన్ ను కలిశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తెలిపారు.