తెలంగాణలో మంత్రులున్నా లేనట్టే
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ పార్టీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో మంత్రులు అనే వాళ్లు ఉన్నారా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొంది. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనంటూ మండిపడింది .
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకు పోయిందని, దీని కారణంగా రూ. 100 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసింది బీఆర్ఎస్. శాఖల మీద పట్టులేకపోడం, అనుభవ రాహిత్యంతో జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆరోపించింది.
పేరుకే డిప్యూటీ సీఎం అని ఆయనను ఎవరూ పట్టించు కోవడం లేదని , ఇంకో మంత్రి గడియారాల మంత్రి అంటూ ముద్దు పేరుందని ఆరోపించింది. మూడో మంత్రి శాఖా పరమైన సమావేశంలో ఆయనకు చోటు ఉండడం లేదని పేర్కొంది బీఆర్ఎస్ పార్టీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్ల దగ్గర భారీ గండి పడిందని, దీంతో పెద్ద వాగు ప్రాజెక్టు నుంచి నీరంతా వెళ్లి పోయిందని పేర్కొంది. దీంతో గ్రామాల్లోకి నీరు చేరిందని, దీని వల్ల వందల ఎకరాలకు పంట నష్టం వాటిల్లిందని వాపోయింది. అసమర్థ కాంగ్రెస్ పాలనకు ఇది పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.