చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి – వెంకన్న
సంచలన కామెంట్స్ చేసిన టీడీపీ నేత
విజయవాడ – టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం వెంకన్న మీడియాతో మాట్లాడారు. చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి అంటూ మండిపడ్డారు. కొడుకుతో కలిసి భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారి దోపిడీ, దారుణాల గురించి బయటకు చెప్పకుండా అడ్డుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు వెంకన్న. పెద్దిరెడ్డి, కొడుకు కలిసి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటీషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు.
పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారని ధ్వజమెత్తారు. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనుచరులు మరో చోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు బుద్దా వెంకన్న.
చిత్తూరు జిల్లా వీరప్పన్ గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నామని స్పష్టం చేశారు. వారి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబు నాయుడును ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపధం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబును ఓఢించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేక పోయారంటూ సెటైర్ వేశారు బుద్దా వెంకన్న.
పెద్ది రెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లదని ఫైర్ అయ్యారు. వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.