బాబు బక్వాస్ సర్కార్ బేకార్ – బుగ్గన
మాజీ మంత్రి షాకింగ్ కామెంట్
హైదరాబాద్ – ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అది శ్వేత పత్రం కాదని కేవలం సాకు పత్రం అంటూ ఎద్దేవా చేశారు. పాలనా పరంగా చేత కాక సొల్లు కబుర్లు చెబుతున్నాడంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. నిందలు, ఆరోపణలు మోపడం సరే ఆధారాలతో బయట పెట్టకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రూ. 7 లక్షల కోట్ల అప్పులు ఉంటే రూ. 10 లక్షల కోట్లు అప్పుగా ఉందంటూ గవర్నర్ తో అబద్దం చెప్పించాడంటూ ఫైర్ అయ్యారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
సంపద సృష్టిస్తామని, పరిశ్రమలు తీసుకు వస్తామని, వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని ఊదర గొట్టిన కూటమి సర్కార్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్ అమలుకు ముందే తొలి ఓవర్ లోనే డకౌట్ అయ్యిందంటూ సెటైర్ వేశారు.
తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అప్పులు చేశాడని, దానిని తీర్చేందుకే తాము తిరిగి అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. తమ నాయకుడు , మాజీ సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నారని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సంక్షేమ పథకాలను అమలు చేశాడని చెప్పారు.
తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు మాజీ మంత్రి. ముఖ్యంగా స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో తల్లికి వందనం అమలు కావాల్సి ఉందని గుర్తు చేశారు.